Friday, May 2, 2008

అంతర్మధనం:1

ఇతరుల అనుభవాల నుంచి పాఠం నేర్చుకునేవాడు ఉత్తముడు. తన అనుభవాల నుండి నేర్చుకునే వాడు మద్యముడు.అసలు అనుభవమే లేనివాడు జ్ఞాని! మూర్ఖుడు! ఎందుకంటే అప్పటికప్పుడు కొత్తగా పుట్టే వింత అనుభవమేమి ఉండదు మనిషికి- దాన్ని అనుభవంగా గ్రహించడానికి. ప్రతి విషయాన్ని ఏదో ఒక జన్మలో జీవుడు అనుభవించే ఉంటాడు. కాబట్టి అన్నీ పాత అనుభవాలే జన్మలో! విషయం తెలుసుకునే జన్మలో అనుభవం లేకుండానే జ్ఞాని ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు.కాబట్టే అసలు అనుభవం లేదన్నమాట ' జన్మలో' .కాని ఇక్కడ మాట్లాడుకోనేది మూర్ఖుడి విషయం. మూర్ఖుడికీ అనుభవమూ వుండదు. జ్ఞానికీ , వీడికీ తేడా ఏమిటంటే జ్ఞాని నేర్చుకుంటాడు -వీడు నేర్చుకోడు ఎక్కడనుంచీ కూడా!మరోటుంది- జ్ఞాపక శక్తి . వీళ్ళిద్దరికీ ఎక్కువే! కాకపొతే చిన్న తేడా : మొదటివాడు మంచి గుర్తుపెట్టుకొంటే, రెండో వాడు చెడు గుర్తుపెట్టుకుంటాడు.

గుర్తుపెట్టుకోవడం గురించి: ఒక విషయం గుర్తుంటేనే దాన్ని జరిగిందని ఒప్పుకుంటాం! రెండో ప్రపంచ యుద్ధం జరిగిందన్న విషయం ప్రపంచంలో అందరూ ఒక్క గంట మర్చిపోయారనుకుందాం-ఎవ్వరూ కూడా యుద్ధం జరిగిందనికాని , చరిత్రలో వుందని కానీ చెప్పరు-చెప్పినా ఒప్పుకోరు. కేవలం జ్ఞాపకశక్తి లోపం! గుర్తున్న విషయాన్నే ఒప్పుకుంటామన్నమాట -గతంలో కూడా! బహుశః భవిష్యత్తు కూడా జరిగే వుంటుంది-గతంలో! కానీ మనకి జ్ఞాపకం లేదు!ఉండటంలేదు!అందుకే జరగలేదని, ఎవరైనా ఇలా జరుగుతుందని చెప్తే అబద్ధం అని కొట్టి పారేస్తాం! కాని జ్ఞాని ఎప్పుడూ అలా చెయ్యడు.వాడికి భవిష్యత్ జ్ఞాపకం వుంటుంది-అందుకే వర్తమానంలో ఎలా మెలగాలో అతడికి స్పష్టంగా తెలుసు. భవిష్యత్ చేతిలో వుంది కాబట్టి వర్తమానాన్ని తనకనుగుణంగా మార్చుకుంటుంటాడు .భవిష్యత్తు బంగారుమయం చేసుకుంటాడు. ఇక్కడ జ్ఞానికి వర్తమానం తో పని.కాని వర్తమానం పునాదులన్ని అతనికి గుర్తున్న గతంపై, భవిష్యత్తుపై ఆధారపడి వుంటాయి.
మూర్ఖుడికీ వర్తమానంతోటే పని.కానీ చిన్న తేడా అల్లా వీడికి గతమూ గుర్తుండదు-భవిష్యత్తూ గుర్తుండదు.పునాదుల్ని వదిలిపెట్టి పైకప్పుని వదిలిపెట్టి కేవలం గోడలు మాత్రం కట్టేస్తాడు-వర్తమానంలో!