Friday, October 3, 2008

నా అంతర్మధనం:2
"ఒక సమస్య నుంచి తప్పుకోవడం సమస్య కి పరిష్కారం కాదు. సమస్య కి సరైన సమాధానం వెతికి సాధించడమే సిసలైన పరిష్కారం" . రాత్రి కలలో వచ్చాయా వాక్యాలు. సరిగ్గా లేవబోతున్నప్పుడు వచ్చాయో లేక ఇవి వచ్చిన తర్వాత మెళకువ వచ్చిందో - అందుకే ఇవి గుర్తున్నాయి. చాలా కలలొచ్చాయి- వస్తూంటాయి. కాని ఏవీ గుర్తుండవ్- ఈ గజిబిజి జీవితాల్లోంచి ప్రశాంతంగా తప్పుకుని వేరేలోకంలో సుఖంగా నిద్రపోదామంటే అక్కడా తప్పట్లేదీ పాట్లు. నిజమేమో అన్పిస్తుంటుంది చాలాసార్లు- భ్రమ పడుతుంటాం కూడా .
నిజంగా లేచిన తర్వాత చాలా ఆలోచించాని వాక్యాల్ని. బహుశః ఇదివరకు విన్నవే కావొచ్చు - కానీ కలలో రావడం వల్ల కొత్తగా వుందేమో! మన మనస్సు లోని భావాలు, మనం ఆలోచించిన ఆలోచనలు రాత్రి కలల రూపంలో వస్తాయట! మరి నాకున్న సమస్యలు ఏమై వుండవచ్చు? లేక లేనిపోని సమస్యలు వూహించుకుంటున్నానేమో!
" జీవితమంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకి ప్రయాణమే కానీ, సమస్యలు లేని జీవితమే వుండదు" - ఒక కవి సూక్తి. నిజమే కానీ, సమస్యలు లేని జీవితంగా నా జీవితాన్ని మలచుకోవడానికి నేను జరిపే ప్రయత్నం, అంతర్మధనం వల్ల ఈ సమస్యలన్నీ - ఏవి?
ఈ సృష్టి లో మనిషి తప్ప మరే జంతువూ ఇంతలా తాపత్రయ పడదేమో జీవిత౦ గురించి. ఎన్నో జన్మల పుణ్యం మనకి ఈ జన్మ ఇచ్చిందట . అందుకని మనకి అప్పచెప్పిన విధులని నిర్వర్తించి, ఈ జన్మ సార్ధకం చేసుకోవాలి. మరి మిగతా జంతువులు,పక్షులు వాటికి పూర్వ జన్మ పాపం వల్ల ఆ జన్మ లభించింది. ఈ జన్మలో అవి పడే బాధల వల్ల వాటి పాపక్షయం జరుగుతుంది- కర్మ సిద్ధాంతం. నేను కొన్ని సార్లు నమ్ముతాను, కొన్నిసార్లు నమ్మను.దేవుడు నీకు సగం సహాయం చేస్తాడు- ఎప్పుడో తెల్సా నీ కృషి సగం వున్నప్పుడు.అదికూడా లేకపోతే వృధా. దేవుడు నీకు ఒక పని చెయ్యమని చెప్తాడు-కానీ దాన్ని ఎలా చెయ్యాలనేది ఆలోచించాల్సినది నువ్వు. దీనిని కూడా దేవుడినే చెప్పమంటే ఎలా? ఈ పని సాధించవలసిన మార్గం మిద ఆధారపడే నీ పాప-పుణ్యాలు వుంటాయి. ధర్మబద్ధంగా చేస్తే పుణ్యం- అధర్మ బద్ధంగా చేస్తే పాపం- సింపుల్ గా ఇదే కర్మ సిద్ధాంతం- నా దృష్టిలో.
సమస్యల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించేవాడిని ఒకప్పుడు.ఇప్పుడు సమాధానం కోసం ప్రయత్నిస్తున్నాను. కల రాక ముందునుండే! కానీ చాలా సమస్యలకి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను- కారణం నేనే. ఆలోచన లేకపోవడం నా ఆలోచనా విధానానికి దేవుడిని నిందించడం దేనికి? స్వయంకృతాపరాధం. అనుకుంటూ వుండేవాడిని - నేను అన్ని సమస్యలకీ పాజిటివ్ గా ఆలోచిస్తానని. తర్వాత తెలిసింది - తప్పని. అలా ఆలోచించ కూడదని. సమస్యని అన్ని కోణాలనుంచీ చూడాలి. ఏ వైపు నుండి సమాధానం దొరుకుతుందో ఆ వైపు నుండి సమాధానం రాబట్టాలి. మన పెద్దలు చెప్పిన సామ, దాన , బేధ, దండోపాయాలు - చిన్న చిన్న గా వీటన్నిటినీ వుపయోగించడం నేర్చుకుంటున్నాను.జీవితం కదా తప్పదు.
కాలేజీ నుంచి వస్తున్నప్పుడు బస్టాండ్ లో ఒక కుక్క పిల్లని చూసాను. ప్రశాంతంగా ఆదమరిచి నిద్దరోతోంది. నేను రాసుకున్న కవితలో లాగ. కొద్దిసేపటికి లేచింది. బయటవెళ్ళే మరో కుక్కని చూసి మొరిగింది, దానిచుట్టూ తిరిగింది. ఆ తర్వాత వచ్చి మళ్ళీ పడుకుంది. అదే దాని ప్రపంచం, లోకం, స్వర్గం ,నరకం. మనలా దానికి విదేశాల్లో బంధువులు లేరు- డాలర్లు పంపారు. ఆ కుక్కపిల్ల విమానం ఎక్కాలనుకోదు- బెంజ్ కారులో తిరగాలనీ అనుకోదు. కనీసం బైక్ మీద తన గర్ల్ ఫ్రెండ్ నెక్కించుకుని ఐమాక్స్ లో సిన్మా కూడా చూడాలని వుండదు. కానీ అది స్వర్గాన్ని అనుభవిస్తోంది. ఎందుకంటే పైవన్నీ దానికి తెలియవు కాబట్టి- అవన్నీ తెలిసున్న నాకు ఎప్పటికైనా ఆ సుఖాల్ని అనుభవిస్తానని ఆశ. ఇదే కదా పతనానికి హేతువు- బుద్ధుడు చెప్పినట్లు. మనిషిని అధ: పాతాళానికి లాక్కు పోతుంది ఆశ. అందుకే ఆశని త్యజించాలి. కానీ అది సాద్యం కాదు కదా! నా కోసం కాకపోయినా సమాజం కోసమైనా ఆశ వుండాలి. స్వార్ధరహితమైన ఆశ. భవిష్యత్తు పై ఆశ. నేను కోరుకున్న భారతావని కోసం ఏదైనా చెయ్యాలని- చెయ్యగలనని. ఈ జీవిత కాలంలో .

Friday, May 2, 2008

అంతర్మధనం:1

ఇతరుల అనుభవాల నుంచి పాఠం నేర్చుకునేవాడు ఉత్తముడు. తన అనుభవాల నుండి నేర్చుకునే వాడు మద్యముడు.అసలు అనుభవమే లేనివాడు జ్ఞాని! మూర్ఖుడు! ఎందుకంటే అప్పటికప్పుడు కొత్తగా పుట్టే వింత అనుభవమేమి ఉండదు మనిషికి- దాన్ని అనుభవంగా గ్రహించడానికి. ప్రతి విషయాన్ని ఏదో ఒక జన్మలో జీవుడు అనుభవించే ఉంటాడు. కాబట్టి అన్నీ పాత అనుభవాలే జన్మలో! విషయం తెలుసుకునే జన్మలో అనుభవం లేకుండానే జ్ఞాని ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు.కాబట్టే అసలు అనుభవం లేదన్నమాట ' జన్మలో' .కాని ఇక్కడ మాట్లాడుకోనేది మూర్ఖుడి విషయం. మూర్ఖుడికీ అనుభవమూ వుండదు. జ్ఞానికీ , వీడికీ తేడా ఏమిటంటే జ్ఞాని నేర్చుకుంటాడు -వీడు నేర్చుకోడు ఎక్కడనుంచీ కూడా!మరోటుంది- జ్ఞాపక శక్తి . వీళ్ళిద్దరికీ ఎక్కువే! కాకపొతే చిన్న తేడా : మొదటివాడు మంచి గుర్తుపెట్టుకొంటే, రెండో వాడు చెడు గుర్తుపెట్టుకుంటాడు.

గుర్తుపెట్టుకోవడం గురించి: ఒక విషయం గుర్తుంటేనే దాన్ని జరిగిందని ఒప్పుకుంటాం! రెండో ప్రపంచ యుద్ధం జరిగిందన్న విషయం ప్రపంచంలో అందరూ ఒక్క గంట మర్చిపోయారనుకుందాం-ఎవ్వరూ కూడా యుద్ధం జరిగిందనికాని , చరిత్రలో వుందని కానీ చెప్పరు-చెప్పినా ఒప్పుకోరు. కేవలం జ్ఞాపకశక్తి లోపం! గుర్తున్న విషయాన్నే ఒప్పుకుంటామన్నమాట -గతంలో కూడా! బహుశః భవిష్యత్తు కూడా జరిగే వుంటుంది-గతంలో! కానీ మనకి జ్ఞాపకం లేదు!ఉండటంలేదు!అందుకే జరగలేదని, ఎవరైనా ఇలా జరుగుతుందని చెప్తే అబద్ధం అని కొట్టి పారేస్తాం! కాని జ్ఞాని ఎప్పుడూ అలా చెయ్యడు.వాడికి భవిష్యత్ జ్ఞాపకం వుంటుంది-అందుకే వర్తమానంలో ఎలా మెలగాలో అతడికి స్పష్టంగా తెలుసు. భవిష్యత్ చేతిలో వుంది కాబట్టి వర్తమానాన్ని తనకనుగుణంగా మార్చుకుంటుంటాడు .భవిష్యత్తు బంగారుమయం చేసుకుంటాడు. ఇక్కడ జ్ఞానికి వర్తమానం తో పని.కాని వర్తమానం పునాదులన్ని అతనికి గుర్తున్న గతంపై, భవిష్యత్తుపై ఆధారపడి వుంటాయి.
మూర్ఖుడికీ వర్తమానంతోటే పని.కానీ చిన్న తేడా అల్లా వీడికి గతమూ గుర్తుండదు-భవిష్యత్తూ గుర్తుండదు.పునాదుల్ని వదిలిపెట్టి పైకప్పుని వదిలిపెట్టి కేవలం గోడలు మాత్రం కట్టేస్తాడు-వర్తమానంలో!

Monday, April 28, 2008

నా గురించి....

పవన్ గణేష్. ఇది నా పేరు. ఊరు ,తదితరాలు అనవసరం అని నా అభిప్రాయం. అవసరం అయినప్పుడు చెప్పవచ్చు. ఇక్కడ వ్రాయబోయేదంతా నా హృదయ కల్లోలం గురించి! అదే నా అంతర్మధనం.
నాకు స్నేహితులు చాలా తక్కువ. కారణం ఈ కల్లోలమే కావొచ్చు. నేను వ్రాసుకున్న లేదా రాసుకోబోయే కవితలు, కధలు అన్నీ నాకోసమే . కానీవాటిని విశ్లేషించి నాకు నాగురించి చెప్పగల వారికోసం నా తపన. నా స్నేహితుల్లో ఒకరిద్దరు అలావున్నారు . కానీ నామనస్సు సంతృప్తి చెందడం లేదు.